Saturday, 16 June 2018

అరుణాచలేశ్వరుడు






అగ్నిలింగాకారంలో కనిపించే అరుణాచలేశ్వరుడు!
పంచభూతాల్లో అగ్నిలింగం
ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించే గిరి ప్రదక్షిణం
పాపాలు హరించే శివపుణ్యక్షేత్రం


భరతఖండం వేదభూమి. లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువైవున్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలం. గాలి, నీరు, భూమి, వాయువు, అగ్ని అనే పంచభూతాల్లో ఒకటి. ప్రకృతిలో మమేకమై పరమాత్మునితత్వం ఉట్టిపడేలా వెలసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. ఈ పేరు మదిలో తలంపుకు రాగానే మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తుంది. ప్రతి యేటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అణువణువునూ శివతేజంతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అంతేనా.. అరుణాచలం అనగానే రమణమహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రం తిరువణ్ణామలై. అలాంటి అరుణాచలేశ్వరుని గురించి ప్రత్యేక కథనం.

చరిత్ర పుటలను తిరగేస్తే...
దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములు హరించునది అనే అర్థం కూడా వస్తుంది. తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అణ్ణామలై అనగా పెద్దకొండ అని అర్థం. ఇక్కడ కొలువైవున్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేదాలు, పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వరకాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు.

శివాజ్ఞ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయం...
అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురము నిర్మించబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా ఈ ఆలయంలో జరిగే పూజాపునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కందపురాణంలోని అరుణాచలేశ్వర మహాత్మ్యంలో ఉంది. ఈ జ్యోతిర్లిగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9, 10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళ రాజుల శాసనాలు చెపుతున్నాయి. తిరువణ్ణామలై పల్లవులు, చోళులు, విజయనగరరాజులు, కన్నడ రాజులు, టిప్పుసుల్తాన్‌ ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల ఏలుబడిలో వుంది.. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడటానికి రెండు నేత్రాలు చాలవు. వీటిని పోటీపడి మరీ నిర్మించారా అనిపిస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది ఒకటి.

పంచభూత క్షేత్రాల్లో ఒకటి
పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూతస్థలాల్లో అరుణాచలం ఒకటి. అన్నామలేశ్వరుడు(అగ్ని) కనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకాంబరేశ్వర ఆలయం (పృథ్వీలింగం - భూమి), జంబుకేశ్వరుడు (జలలింగం - నీరు), కాళహస్తీర్వుడు (వాయులింగం - గాలి), చిదంబరేశ్వరుడు (ఆకాశలింగం - ఆకాశం). దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు.

గిరిప్రదక్షిణం కాదు.. సాక్షాత్‌ శివప్రదక్షిణం
ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్‌ జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తే సాక్షాత్‌ ఆ శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం. రమణ మహర్షి ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. పాదచారులై శివనామ స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే గిరిప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కొండలపై ఉండే మహాఔషధ మొక్కల ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. దీన్నే గిరివాలం అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాపవిముక్తులవుతారని, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలచుకుంటే అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తులు భావిస్తారు. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్‌ ఆఫ్‌ ఎర్త్‌ (భూహృదయం)గా అభివర్ణించారు. స్కందపురాణంలో అన్నికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని పేర్కొన్నారు.

అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు..
అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువణ్ణామలై శాశ్వతమైన శాంతినొసగే ప్రశాంతభూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణాచలేశ్వరుడు కొలువైవున్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చటి చెట్లతో చుట్టూత కొండలతో అణువణువునా ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్ని కొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్ర కొండ అని, కలియుగంలో రాతి కొండ అనే పేర్లు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండని తేజో లింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు. కొండ చుట్టూ ఎనిమిది లింగాలు, ఎనిమిది నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. ఎనిమిది లింగాలు అంటే ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం (ఈ లింగంపై ప్రజలు నాణేలు వేస్తారు), ఈశాన్య లింగం అనే పేర్లు ఉన్నాయి.

యేడాదిలో 4 బ్రహ్మోత్సవాలు
ఈ క్షేత్రంలో ఒక యేడాదిలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీక మాసం (నవంబరు, డిసెంబరు)లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాగే, ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్రపౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఎలా వెళ్ళాలి...
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది. అలాగే, రమణాశ్రమంలో కూడా గదులు అద్దెకు ఇస్తారు. అయితే, ఇక్కడ గదులను ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు.





No comments:

Post a Comment

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...